Monday, April 25, 2016

'భక్తకన్నప్ప' గురుకులం : గిరిపుత్రుల బతుకుల్లో వెలుగు..మల్లిఖార్జునుడి సేవలు 'స్ఫూర్తి'ని పురిగొలుపు

ఆత్మకూరు రూరల్‌ (వి.వి): నల్లమల్ల అడవుల్లో... అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గిరిపుత్రులు...నిరక్షరాస్యులుగా నిర్వేదంతో గడుపుతున్న జీవితాలను చూసి ఆయన హృదయం...చలించింది. అంతటి వెనుకబాటు తనానికి కారణాన్ని అన్వేషించేందుకు ఆయనను పురిగొల్పింది. అడవుల్లో నివసిస్తున్న ఆ గిరిజనులకు అరకొర విద్యే తప్ప, ఉన్నత విద్య దక్కకపోవడమే వారి వెనుకబాటుతనానికి కారణమని గుర్తింపజేసింది. పదవీవిరమణ అనంతరం తన జీవితాన్ని గిరిజనుల సేవ కోసం అంకితం కావడమే లక్ష్యంగా ముందడుగు వేయించింది మల్లిఖార్జునశర్మను. నిరంతర అన్వేషణ, విద్యాభివృద్దికి అతనెంచుకున్న మార్గం పలువురికి 'స్పూర్తి' నిస్తోంది. కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలోని భక్త కన్నప్ప గురుకులంపై...ప్రత్యేక కథనం.
చలించిన హృదయం : సున్నిపెంట పాలిటెక్నిక్‌ కళాశాలలో 1990-94 సంవత్సర కాలంలో ప్రిన్సిపాల్‌గా ఆయన విధులు నిర్వహించారు. గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన కళాశాలలో అప్పటి వరకు ఒక్క గిరిజనుడు కూడా పాలిటెక్నిక్‌ పూర్తి చేయక పోవడం గ్రహించారు. ఇంత వెనుకబాటుతనానికి కారణమేమిటని అన్వేషించాడు. గిరిజనుల్లో విద్య పట్ల చైతన్యం లేకపోవడం, సమాజానికి దూరంగా ఉండడమే కారణమని నిర్థారించుకున్నారు. వీరికి విద్యా బుద్ధులు నేర్పి సమాజంలో తలెత్తుకు తిరిగేలా ఎలా చేయాలి అన్న ఆలోచనల్లోంచి ఆవిర్భవించిందే...ఈ 'భక్తకన్నప్ప' గురుకులం ఏర్పాటు.
చేయూత : మల్లిఖార్జున శర్మ (ఆర్‌.జె.డి టెక్నికల్‌) పదవీ విరమణ అనంతరం, నవంబర్‌ 18న గురుకులాన్ని శ్రీశైలంలో శివాజీ స్పూర్తి కేంద్రంలో ప్రారంభించారు. ఇతని ఆశయాన్ని, పట్టుదలను చూసిన కీ..శే..గుణంపల్లి పుల్లారెడ్డి,సేవాభారతి చేయూత నందించారు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో 3 ఎకరాల స్ధలంలో కీ.శే.. గుణంపల్లి పుల్లారెడ్డి శాశ్వత నిర్మాణాలు నిర్మించి సంవత్సరం పాటు గురుకులానికి కావల్సిన నిధులను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇతనికి మరింత ఊతమిచ్చినట్లైంది.
నెరవేరుతున్నన ఆశయం :1999వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన గురుకులంలో 20 మంది చెంచు విద్యార్ధులతో శ్రీకారం చుట్టారు. విద్యార్ధుల సంఖ్య 2011 నాటికి 54కు పెరిగింది. ఆవాసంలో చదివిన విద్యార్ధుల్లో 2010-11 సంవత్సరంలో మొదటి సారిగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్‌, పాలిటెక్నిక్‌ వంటి కోర్సుల్లో చేరడం జరిగింది. అంతేకాక విద్యార్ధుల్లో దాగి
ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు విలువిద్య, రన్నింగ్‌, యోగా వంటి కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ సైతం ఇవ్వడం జరుగుతోందని ఆయన వివరించారు. వనవాసి కళ్యాణ పరిషత్‌ 2010 డిసెంబర్‌ అఖిలభారత స్ధాయి నిర్వహించిన విలువిద్య పోటీల్లో మొదటి సారిగా ఇక్కడి విద్యార్ధులు పాల్గొన్నారు. గత సంవత్సరం డిసెంబర్‌ లో నిర్వహించిన పైకా పోటీల్లో జిల్లా స్ధాయిలో విలువిద్యలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. 12 సంవత్సరాల అంకుఠిత దీక్ష, మొక్కవోని ధైర్యంతో, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. 10వ తరగతి పూర్తిచేసుకొని పై చదువులకు వెళ్ళడంతో తన ఆశయం, కల నెరవేరుతుందన్న ఆనందాన్ని వెలిబుచ్చారు.
గురుకులం విద్య : విల్లంబులు, తేనె, కుంకుడుకాయ, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే వీరి ప్రమాణ శైలి మారడంతో కొత్త విద్య నేర్చుకుంటున్నారు. 54 మంది విద్యార్ధులు చదువుతోపాటు వారు స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో బతికేందుకు వృత్తి విద్యలైన వెల్డింగ్‌, కార్పెంటరీ, ఎలక్ట్రిషియన్‌ పనులను గురుకులంలో నేర్పిస్తున్నారు. క్రమశిక్షణతో , భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వారికి నేర్పిస్తూ నేటి సమాజంలో మేము తక్కువ కాదు అని తలెత్తుకు తిరిగేలా ఆత్మ విశ్వాసాన్ని ఈ గురుకులంలోని గిరిపుత్రుల హృదయాల్లో నింపుతున్నారు.
నిర్వహణ : గురుకులం నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందటం లేదు. ఇప్పటి వరకు సహృదయులు చేసిన సహాయంతో ముందుకు కొనసాగుతుంది. ఇక్కడి విద్యార్ధులకు చదువు, సంస్కారంతో పాటు తిండి, గుడ్డ అన్ని సమకూర్చడం వల్ల నిర్వహణ వ్యయం అధికమైంది.విద్యార్దులసంఖ్య పెరగడం, నిత్యావసర సరుకుల ధరలు అధికంగా ఉండడంతో ఒక్క రోజుకు రెండు వేలనుండి మూడు వేల వరకు నిర్వహణ కోసం వెచ్చించాల్సి వస్తుంది.
మమ్మీ ..డాడి.. సంస్కృతి వీడి : ప్రస్తుత సమాజంలో కేజి నుండి పీజి దాకా ఇంగ్లీషు మీడియం వైపు పరుగులు తీస్తూ తెలుగుతనాన్ని మరిచిపోయే దుస్థితి నెలకొంది. వ్యక్తిత్వ విలువల కోసం కాకుండా చదువు కేవలం సంపాదనకే అని మారిపోయిన ప్రస్తుత తరుణంలో సంస్కృతి కోసం సనాతన ఆచారాలు, గురువుకు విలువనిచ్చే విద్యచెంచుల ద్వారా జీవం పోసుకుంది. నల్లమల అరణ్యంలో మారుమూల గ్రామాల్లో నివసించే చెంచులను ఒప్పించి చదువు, ఉచితంగా చెప్పేందుకు భక్తకన్నప్ప'గురకుల అవాసం ఎన్నో అవస్ధలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ విజయపధం వైపు దూసుకెళ్తుంది. చెంచులలో ప్రస్తుత సమాజంలో బతికేందుకో,సనాతన సంప్రదాయాలను వారసత్వంగా అందించేందుకో మమ్మీ... డాడి సంస్కృతి విస్మరించి కొత్త పందాలో సాగుతున్న భక్తకన్నప్ప' గురుకులం ఆశయాన్ని ప్రతీ ఒక్కరు స్వాగతించాలి. ఒక మంచి ఆశయం కోసం సంస్కృతి, పరిరక్షణ పేరిట కొనసాగుతున్న ఈ పవిత్ర తంతుకు చేయూతనిద్దాం.

No comments: