Tuesday, November 16, 2010

రాలిపోతున్న అడవి బిడ్డలు చెంచుపెంటల్లో మరణ మృదంగం

Source: Andhrajyothy

మహబూబ్‌నగర్, నవంబర్ 16: ప్రపంచంలో అత్యంత అరుదైన జాతిగా గుర్తింపు పొందిన చెంచులు నల్లమల అటవీప్రాంతంలో కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. మలేరియా, క్షయ, వంటి వ్యాధుల బారిన పడి వారు పిట్టల్లా రాలిపోతున్నారు. సర్కారు వైద్యం వారికి అందడం లేదు. అనారోగ్యంతోపాటు, మైదాన ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల కూడా వారి సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది.

నల్లమల ప్రాంతంలో ఏడాది వయసులోపున్న చెంచు శిశువుల్లో ప్రతి వంద మందిలో, పది మంది చనిపోతున్నారని వైద్యాధికారి ఒకరు పేర్కొన్నారు. టీకాలు ఇచ్చేవారు లేరు. పౌష్టికాహారం లేక వ్యాధి నిరోధకశక్తి లోపించి బాలింతలు చనిపోతున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే, ఇక్కడి చెంచుల్లో బాలింత మరణాలు ఐదురెట్లు ఎక్కువగా ఉన్నాయి. సెరిబ్రమ్ మలేరియా, డయేరియా, చర్మవ్యాధులు, రక్తహీనతవల్ల కూడా మరణాలు ఎక్కువవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఇటీవల అప్పాపూర్‌పెంటలో 10 మందికి ప్రైవేటు వైద్యుడొకరు రక్తపరీక్షలు నిర్వహించగా, 8 మందికి మలేరియా ఉన్నట్లు తేలింది. అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదని చెంచులు వాపోతున్నారు. ఇటీవల ముత్తయ్య అనే చెంచుకు సెరిబ్రెమ్ మలేరియా ఉన్నట్లు నిర్ధారణైంది. చికిత్సకోసం పెద్దాస్పత్రికి తరలించాలి కాబట్టి 108 వాహనం పంపించాలని సంబంధిత సిబ్బందికీ, ఐటీడీఏ పీఓకు, జిల్లా వైద్యాధికారికి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. దీంతో రెండురోజులకే ముత్తయ్య చనిపోయాడని చెంచులు వివరించారు.

ఒక పెంటలో చనిపోయిన వ్యక్తి గురించి, ఫర్లాంగు దూరంలో ఉన్న మరో పెంటవాసులకు నాలుగైదురోజులకు గానీ తెలువదు. కాబట్టి వారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోలేరు. ఇటువంటి పరిస్థితిలో అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని దూర ప్రాం తానికి తరలించారు. అప్పాపూర్‌పెంటలోని ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం ఈ విధంగా రెం డేళ్ల కిందట దాదాపు 20 కి.మీ.ల దూరంలోఉన్న వటవర్లపల్లికి మారింది.

ఇక ఇక్కడి చెంచు మహిళలకు ప్రసూతి ఆసుపత్రి అంటే తెలియదు. ఇప్పటికీ వారి గుడిసెల్లోనే కాన్పులు చేస్తారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సదుపాయం లేదని గురువమ్మ అనే చెంచుయువతి తెలిపింది. ఆరేళ్ల కింద కొల్లాపూర్ ప్రాంతంలోని 13 చెంచుపెంటల నుంచి 88 కుటుంబాలకు చెందిన సుమారు 200 మందిని మైదాన ప్రాంతానికి తరలించారు. వీరిలో కొంతమందికి అరకొర వసతి సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం మిగిలినవారిని గాలికొదిలేసింది.

ఈ విధంగా చెంచుల జీవన వ్యవస్థ మరింత అస్తవ్యస్తమైంది. గడచిన రెండేళ్లలో వారిలో 40 మందికి పైగా రోగాల బారినపడి మృత్యువాత పడ్డారు. 1991 గణాంకాల ప్రకారం పాలమూరు జిల్లాలోని నల్లమల ప్రాంతంలో 10వేల మంది చెంచులున్నారు. ఇప్పుడు వారి సంఖ్య 8వేలకు పడిపోయింది. ఆరోగ్య వైద్య సిబ్బంది ఎప్పుడో ఓసారి వస్తారు. జ్వరమొచ్చిందంటే మందు బిళ్లలు ఇచ్చి వెళతారు తప్ప రక్త పరీక్షలు చేయరని స్వామి, లింగమ్మ అనే చెంచులు చెప్పారు. సర్కారు తమ కోసం కొత్త ఆసుపత్రులు పెట్టకున్నా, ఉన్న ఆరోగ్యకేంద్రాన్నయినా తాము ఉండే చోటికి మార్చాలని చెంచు సంక్షేమ సమితి కన్వీనర్ కృష్ణయ్య కోరుతున్నారు.

No comments: